where trouble was needed

March 7, 2006

ముట్టు

Filed under: We Shall Overcome — Aravinda @ 8:00 pm
Tags: , ,

ముట్టు

ఎక్కడ పడితే అక్కడె విష్పర్, కేర్ఫ్రీ, స్టేఫ్రీ కి ప్రకటనలు వస్తుంటే, అసలు మన దేశములో ముట్టు గురించి ఎవరికైన విష్పర్ చేయవలసిన అవసరం వచ్చిందా? అవకాశం వచ్చిందా? ముట్టు వస్తే మనకి ఫ్రీడం ఎప్పుడు వచ్చి చచ్చింది? అనే ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే, మన అమ్మాయిలకి “పెద్ద మనిషి” అయినప్పడు, నలుగురిని పిలిచి ఫంక్షన్ చేసి వూరంతా చెప్పినప్పటి నించీ, ప్రతి నెల వాళ్ళకి మెడలో “ముట్టు” అనే నోటిస్ బోర్డు పెట్టినట్టే ఉంటుంది. ఏ నెల తప్పినా చెవులు కొరికే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నెలకి మూడు రోజులు వాళ్ళు అంటరానివాళ్ళ తో సమానము. ఎవరిని తాకకుండా, ఎవరికీ వాళ్ళ నీడ తగలకుండా ఉండాలి. వంటా, పూజ చేయకూడదు. ఇంకా చేయకూడదనే లిస్ట్ ఇక్కడినించి అకాశం దాకా ఉంటుంది.

మూడు రోజులు మూల కూర్చోవటం, నా చాప, పరిమితంగా నా బట్టలు, దుప్పట్లు పెట్టుకోవటం, పసుపులు జల్లి తల స్నానం చేయ్యటం, పై నించి మంచినీళ్ళు పోయించుకోవటం, చేతులు తాకకుండా పేకాట ఆడుకోవటం, ఇవన్ని నాకు ఇంకా బాగా గుర్తున్నాయి.

ఇంకా ఎన్నో నియమాలు మరియు నిబంధనలు ఉంటాయి. వేటికి అర్ధాలు ఉండవు, ఉన్నా చెప్పరు. ఎవరో చెప్పారు, నేను ఎందుకు అని అడగలేదు, అందుకని నువ్వు అడిగితే నేను చెప్పలేను. కాని చేయవలసిందే. ఇదే వేదం. మరి కొంత మందికి అది రెండు రోజుల్లోనే అయిపోతుంది, అప్పుడప్పుడు వారం రోజులు కూడా ఉంటుంది, అందరూ మూడు రోజులు ఎందుకు కూర్చోవాలి? అని అడిగితే దానికీ సమాధానం ఉండదు. కొంత మందికి ఆ ముట్టు రాకముందు నీరసంగా ఉంటుంది, వాళ్ళు అప్పుడు పనులు మానుకోవచ్చా? బట్టలు, నీళ్ళు, వండినవి ముట్టుకుంటే అవి మైల పడేవిట, కాగితాలు, వేరే సామాను ముట్టుకుంటే ఫరవాలేదు. సరెలే ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కువగా అడిగితే ఇది కూడా ముట్టుకోకూడదంటారేమో. ఒక పోటీ లాగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ చాదస్తమో వాళ్ళే గొప్ప అన్నట్టు.

ఈ ముట్టు శాస్త్రం “బైట” ఉండే రోజులల్లోనే కాకుండా, “ఇంట్లో” ఉండే రోజులల్లో కూడా తన ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి మిగితా నెల రోజుల్లో కూడా ఆడ వాళ్ళు చేయ్యరానివి ఏవేవో ఉంటాయి. “ఎందుకు?” అని అడిగితే ఎక్కడో అక్కడ ముట్టు తో లింక్ ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాలలో, ఆడ వాళ్ళని వేరు చెయ్యటానికి ఉపయోగిస్తారు. కొన్ని పూజలకి, యాత్రలకి, స్పష్టంగా “బాలా కుమారీలు, పెద్ద ముత్తయిదువులు” రావచ్చని అంటారు, ఆ రోజు ముట్టు అవుతున్నా, అవకపోతున్నా, ముట్టు అయ్యే ప్రసక్తి ఉన్న మహిళలని వేరు చేస్తారు. ఎందుకంత భయం అనే ప్రశ్న గురించి సైకాలజిస్టులు అన్వేషించాలి.

ముఖ్యంగా పెళ్ళి చేసేటప్పుడు, మొగ వాళ్ళకున్న అర్హతలు ఆడవాళ్ళకి ఉండవని చెప్పటానికి ఎన్నో సాంప్రదాయాలు చేరుకొన్నాయి. కన్యాదానాలు, అప్పగింతలు మానమంటే మానుతారు కాని పెళ్ళి చేయ్యటానికి మహిళా పూజారి కావాలనుకొంటే, దొరకదన్నారు. ఎందుకు? పెళ్ళికి ముందుగా పెళ్ళి కొడుకుకి వొడుగు అవసరం, పెళ్ళి కూతురికి లేదన్నారు. ఎందుకు చేయ్యటలేదు? అది కుదరదన్నారు. ఎందుకు? అడిగితే, ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి అవటానికి అర్హులు కారు… ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం వచ్చేది: “ముట్టు.” “ముట్టు అంటే మైల.” ముట్టు ఎంత దోషమో చెప్పటనికి ఏవేవో వేదాలు, శాస్త్రాలు, ఎన్నో రకాలుగా చెప్పారుట. సత్య యుగం లో ముట్టుండేది కాదుట. సీత కాలం లో ఇవన్నీ అవకుండగానే పిల్లలు పుట్టే వాళ్ళట. ఏది నమ్మకపొయినా ఇంకా నమ్మలేని విషయాలు చెప్పేవాళ్ళు.

అసలు ఆడవాళ్ళకి ముట్టే లేకపోతే, మానవ జన్మ గతేమిటి? అది తెలిసి కూడా అదేదో మహాపాపం, దురదృష్టం అన్నట్టు భావిస్తారు మన వాళ్ళు. మనము ఏ పాపం చేస్తే ముట్టు వచ్చిందో అని చెప్పటానికి కథలు కూడా ఉన్నాయి. అందుకనే కాబోలు, ఆ ముట్టు అయ్యే రోజులు సులభం చేయ్యటానికి ఎక్కువ ప్రయత్నాలు కూడ చెయ్యటం లేదు. అసలు మనం ముట్టుని ఒక ఇబ్బంది లాగా ఎందుకు చూసుకుంటాము? ఈ ప్రశ్నలు అడిగితే చాలా మంది విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే అది ఇబ్బంది “లాగ” కాదు, ఇబ్బందే. ఎక్కడి కైనా వెళ్ళాలన్నా, ఎవరైన రావాలన్నా, పెళ్ళి ముహూర్తాలు సైతం చూడాలన్నా, మొట్ట మొదట్లో అసలు “ఆ రోజుల్లో” రాకూడదని చూసుకుంటాము. అన్నిటికి “ఆ రోజులు” తప్పుకోవాలంటే మన జీవితంలో 10-25% పక్కన పెట్టవలసి వస్తుంది.

మా అత్త చెప్తుంది, 50 ఏళ్ళ కిందట వాళ్ళ పెళ్ళి అయినప్పుడు ముహూర్తం పెట్టటానికి వాళ్ళ అక్కలు, ఆడ పడుచులు, అందరి ముట్ల తారీకులు చూసి పెట్టినా, మొత్తానికి పెళ్ళి రోజు తనకే ముట్టు వచ్చింది. నోరు మూసుకొని పెళ్ళి చేసేసుకుంది.

ఈ పద్ధతులు ఎవరు పాటిస్తునారో, ఎంత కాలం నించి పాటిస్తున్నారో వివరించే పని సోషియాలజిస్ట్‌లకి వదిలేస్తాను. ముట్టుని వర్ణిస్తూ క్షేత్రయ్య, అన్నమయ్య, చోఖమేల లాంటి మహాకవులు ఏమి పాడారో అర్ధం చేసుకొనే పని సాహితీ పండితురాళ్ళకి వదిలేస్తాను. ఈ వింత సంప్రదాయాల వల్ల, నాకు కూడా ముట్టు అనేది ఒక దురదృష్టం అనే అభిప్రాయం బలంగా ఏర్పడిపొయింది. ఏ ఆడపిల్లకైనా వేరే అభిప్రాయం కలగడానికి అవకాశం వుందా?

***చిన్నప్పుడు నేను Anne Frank 13 ఏళ్ళప్పుడు రాసిన ఆత్మకధ చదివాను. WW-II జరుగుతునప్పుడు, చావు బ్రతుకుల్లో దాక్కుంటూ ఒక డైరీలో తన వ్యక్తిగతమైన ఆలోచనలు రాసేది. ముట్టు గురించి రాసినది నేను ఎప్పుడు మరిచిపోలేదు. “ఎంత ఇబ్బందైనా, ఇది నా సొంతమైన, తియ్యటి రహస్యం” అని రాసింది. ఆ అమ్మయికి అంత ధైర్యం, అంత మనశ్శాంతి ఎట్లా వచ్చిందో నాకు ఎప్పుడు అశ్చర్యంగా ఉండేది. ఇరవై ఏళ్ళ తరవాత నాకు కూడ, ముట్టు విషయంలో, ఆ శాంతి దొరికింది.

నిజానికి నేను “కప్” గురించి విని 6-7 సంవత్సరాలు అవుతోంది. ఎక్కడ విన్నానంటే, మహారాష్ట్ర లో ఒక గిరిజన గ్రామం లో. గిరిజనులు చెప్పలేదులే – వాళ్ళు ఏమి చేస్తారో నేను అడగలేదు, వాళ్ళూ చెప్పలేదు. కాని వూరునించి వచ్చిన వాళ్ళము కొందరం ఈ సమస్య గురించి మాట్లాడుకున్నాము … ఏమి చేస్తాము ఇక్కడ ఎక్కడా డస్ట్‌బిన్ లేదు. వాడిన నాప్‌కిన్లు ఏమి చేయ్యాలి? పేపర్లో కట్టేసి మళ్ళీ వూరికి వెళ్ళినప్పుడు పారేయాలి. కొందరము బట్ట వాడుకున్నాము, అవి పెంకుళ్ళ మీదా తొందరగా ఆరిపోతాయి, ఎవరికి కనపడకుండా. ఇలా మాట్లాడుకుటుంటే, కెనడా నించి వచ్చిన ఒక అమ్మాయి ఏమి చెప్పిందంటే, చిన్న రబ్బర్ కప్ వాడుకుంటుందని. అది వూరికే లోపల పెట్టుకుని, రోజుకి రెండు మూడు సార్లు పారపోసి, సుబ్బరంగా కడిగి, మళ్ళి లోపల పెట్టుకోవచ్చుట. నిమిషం కూడా పట్టదు.

అప్పుడే నేను అది ట్రై చేసుంటే ఎంత హాయిగా ఉండేదో, అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అస్సలు ముట్టు హాయిగా ఉంటుందా? చదువుకొనే రోజుల్లో ఐతే అప్పుడప్పుడు నాకు కాళ్ళల్లో, పొట్టలో ఎంత నొప్పి ఉండేదో, అస్సలు ఇవాళ క్లాస్‌కి క్షేమంగా చేరగలనా లేదా అన్నట్టు ఉండేది. స్నానం చేసి ఇంటి నించి బయల్దేరే లోపల నాప్‌కిన్ మార్చుకోవాల్సి వచ్చేది ఒక్కోసారి. అది అవుతున్న రోజుల్లో ఏదో ఒక రకమైన బరువు, వాసన, చెమట. నాకే అనిపించలేదు ఇదంతా పెట్టుకుని గుడికి కాని పెళ్ళి పేరంటములకు కాని వెళ్ళాలని. ముట్టు అంటే అశుభ్రమైనది అనే భావం నాకు కూడా ఉండేది.

ఈ లోపల ప్రతి నెల నేను ఇంతా చెత్త పారేయటము కూడ నాకు నచ్చలేదు. బట్ట సంచీలు తీసుకెళ్ళి కూరలు కొనుకోటం, సీసాలు తీసుకెళ్ళి బల్క్ లో బియ్యము, పిండి, పప్పులు నింపుకోవటం, రుమాలు పెట్టుకోవటం, కాగితాలన్ని recycle చెయ్యటం, తొక్కలు, గింజలన్నీ compost చెయ్యటం అలవాటు అయినప్పుడు, ఈ వొక్క విషయం లో ఎందుకు చెత్త ఎర్పడాలి అనే సమస్య గురించి ఆలొచించాను. మన వాళ్ళు ఎప్పుడి నించో పాత చీరలు చింపుకుని మడతపెట్టి వాడుకుంటునారనుకో, కాని అవి అధునికంగా చెయ్యకపోతే వాడుకోటానికి వీలుగా ఉండవు. అమెరికా లో చాలా మంది పర్యావరణం గురించి శ్రద్ధ తీసుకుని బట్ట తో menstrual pads ఎలా design చేస్తే వేసుకోటానికి మెత్తగా, బరువు లేకుండగా ఉంటుందో, వుతకటానికి సులభంగా ఉంటుందో అనే దాని గురించి ప్రయత్నాలు చేసి, దూదితో, బాగా దువ్వేసిన గోగి తో బట్టతో pads కుట్టి అమ్ముతున్నారు. నేను చదువుకునే రోజుల్లో అప్పుడే దుకాణం లో “Glad Rags” అనే మోడల్ కొత్తగా దొరికితే కొన్నుకున్నాను. 25 డాలర్లకి మూడు వచ్చేవి. మెల్లి మెల్లిగా బల్క్‌లో పాకెట్లూ కొన్నాను, ఇంకా disposables వాడుకోవటం పూర్తిగా మానేసాను.

పర్యావరణం గురించి కొన్నాను కాని వీటి వల్ల చాలా లాభాలు కనిపించినాయి నాకు. మొట్ట మొదటి రోజు నాకు కూచిపూడి క్లాస్ ఉంది, కొంచం భయపడ్డాను, ఇది ఎట్లా ఉంటుందో అని. కాని ఎంతో హాయిగా ఉంది. వాసన లేదు, నొప్పి లేదు, బరువు లేదు. అసౌకర్యం లేదు. అప్పుడే నాకు తెలిసింది, నేను మళ్ళీ disposables వాడనని. పదేళ్ళు ఇట్లా గడిచినాయి. మా అమ్మయి పుట్టిన తరవాత కొత్త నాప్‌కిన్స్ కొందామని చూస్తే, అప్పడికి ఇంటర్నెట్ లో చాలా రకాలు, కంపనీలు తయారు చేస్తున్నాయి. అన్నీ చూసి ఏవో కొన్నాను, కాని మళ్ళీ కప్ గురించి అలోచించాను. ఇది వాడుకుని చూద్దామా? నా స్నేహితురాళ్ళందరికి ఈమేళ్ళు కొట్టాను. ఎవరైతే ట్రై చేసారో, వాళ్ళందరు కప్ గురించి గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. రెండు రకాలు ఉన్నాయి ఇంటర్నెట్లో. ఒకటి రబ్బర్, ఒకటి సిలికోన్‌. రెండిటికీ గారంటీ ఉంది – నచ్చకపోతే పైసలు వాపస్ ఇస్తారు. ఇలాంటప్పుడు ట్రై చేస్తే నష్టం ఏమిటీ?

ఆర్డర్ ఇచ్చాను. పొస్ట్ లో వచ్చింది. ఇంకా నా పీరియడ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను.

ఆ తరువాతా మేమంత కలిసి గ్రాండ్ కేన్యన్ చూడటానికి వెళ్ళాము. అది ఎంత బ్రహ్మాడంగా ఉందో, ఇంకో విషయం కూడ అంత స్ట్రైకింగ్ గా ఉంది. అక్కడ తిరుగుతునప్పుడు మెన్సెస్ మొదలైనా, నేను “అయ్యో!” అనుకోలేదు. అయిపోయినప్పుడూ నేను “అమ్మయ్య!” అనుకోలేదు. ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు పోయినా, నాకు ఏమి ఇబ్బంది లేదు.

ఈ ఇబ్బంది లేకుండా ఉంటే రాత్రి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మనలో మనకి ముట్టు గురించి నామోషీ లేకపోతే, మన గురించి వేరే విషయాల్లో కూడా అభిప్రాయాలు మార్చుకోలేమా? దీనీ గురించి ఇంకా చాలా మంది చర్చిస్తే బాగుంటుంది. కనీసము మూఢ నమ్మకాలని ఎదుర్కొనే ధైర్యం తెచ్చుకోగలము. ఇంకోకళ్ళ అనుమతి కాని బలవంతం కాని లేకుండా, మన పనులు మనం చేసుకోవచ్చు, తిరగవలసినప్పుడు తిరగచ్చు, విశ్రాంతి కావాల్సినప్పుడు తీసుకొవచ్చు. ఆడ వాళ్ళకి ఈ స్వతంత్రం వస్తే అన్ని రంగాలో కూడ స్వాతంత్ర్యం కోసం ప్రయత్నం ఇంకా బలంగా చెయ్యగలము.

అరవింద

Originally Appeared in ఈ మాట Issue 42, March 2006

http://eemaata.com/issue42/muTTu.html

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Ask Amma

Peace, Justice and Sustainability on the Home Front

Jivanshala

Reflections on Education

Exert, exhale

Please subscribe for useful updates on Homeschooling and life in general

Voice

Ideas, Thoughts and many more..

%d bloggers like this: